Post on 2024-02-05
దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'లక్కీ భాస్కర్' నుంచి ఫస్ట్ లుక్ విడుదల
ప్రఖ్యాత నటుడు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా కెరీర్‌ను ప్రారంభించిన దుల్కర్ సల్మాన్.. అనతి కాలంలోనే తన ప్రత్యేకతను చాటుకొని, వివిధ భాషల ప్రేక్షకుల మనసు గెలుచుకొని పాన్-ఇండియా నటుడిగా ఎదిగారు. గత 12 సంవత్సరాలుగా తన నటనతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దుల్కర్.. ఇప్పటికే చిరస్థాయిగా నిలిచిపోయే పలు చిత్రాలను అందించారు.
దుల్కర్ సల్మాన్ తన తదుపరి చిత్రం 'లక్కీ భాస్కర్' కోసం.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అద్భుతమైన చిత్రాలను అందించే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు. వినోదభరితమైన మరియు హృదయాన్ని కదిలించే కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
నటుడిగా దుల్కర్ సల్మాన్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 'లక్కీ భాస్కర్' నుండి తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న లుక్‌లో దుల్కర్ కనిపిస్తున్నారు. 80ల కాలం నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు.
సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి, ఈ సినిమా అంతా ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణమైన ప్రయాణం గురించి అని నిర్మాతలు చెబుతున్నారు. విభిన్న కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి శాయశక్తులా కృషి చేస్తున్నారు.