Post on 2023-12-12
‘డెవిల్’ సినిమా కోసం 90 కాస్ట్యూమ్స్‌ను ఉపయోగించిన నందమూరి కళ్యాణ్ రామ్
డిఫరెంట్ మూవీస్‌తో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇదొక పీరియడ్ డ్రామా. బ్రిటీష్‌వారు ఇండియాను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కిన సినిమా కావటంతో నాటి పరిస్థితులను ఆవిష్కరించేలా భారీగా సినిమాను చిత్రీకరించారు. అలాగే నటీనటులకు సంబంధించిన వస్త్రాలంకరణ భారతీయతను ప్రతిబింబించేలా ఉంటుంది.
కళ్యాణ్ రామ్‌ను గమనిస్తే ఆయన ఇందులో గూఢచారిగా కనిపించబోతున్నారు. ఇలాంటి పాత్రను ఆయన చేయటం ఇదే మొదటిసారి కావటంతో దర్శక నిర్మాత అభిషేక్ నామా, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ , కళ్యాణ్ రామ్ లుక్‌ను సినిమా ఆసాంతం సరికొత్తగా ఉండేలా డిజైన్ చేశారు.
దీని గురించి కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ మాట్లాడుతూ ‘‘అభిషేక్ నామాగారు డెవిల్ స్క్రిప్ట్ నాకు వివరించగానే హీరోగారి లుక్ డిఫరెంట్‌గా ఉండాలని అర్థమైంది. ఇందులో హీరో భారతీయుడు, అయినప్పటికీ బ్రిటీష్ గూఢచారిగా పని చేస్తుంటారు. ఆయన పాత్ర ను ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయాలనుకున్నాను. డెవిల్‌లో కళ్యాణ్ రామ్‌ను గమనిస్తే ఆయన ధోతి కట్టుకుని ఉంటారు. పైన ఒక వెయిస్ట్ కోటుని ధరించి ఉంటారు. ఆయన కాస్ట్యూమ్స్‌లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం’’ అన్నారు.