Post on 2024-02-19
మమ్ముట్టి 'భ్రమయుగం' చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ 'భ్రమయుగం' తెలుగులో ప్రతిష్టాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 23న విడుదల కానుంది.
కొందరు నటులు తమ నటనా నైపుణ్యంతో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అటువంటి లెజెండరీ నటుడే. ఆయన నటించిన సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. మమ్ముట్టి తాజా చిత్రం 'భ్రమయుగం' కూడా అలాగే అందరి దృష్టిని ఆకర్షించింది.
విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను నిర్మిస్తున్న సూర్యదేవర నాగ వంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ అద్భుతమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో 'లియో' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని విడుదల చేసిన సితార సంస్థ.. ఇప్పుడు 'భ్రమయుగం' తెలుగు వెర్షన్ ను ఫిబ్రవరి 23న విడుదల చేస్తోంది.